కరీంనగర్‌లో నిబంధనలు ఇక అత్యంత కఠినం.. కలెక్టర్, సీపీ వెల్లడి

కరీంనగర్ జిల్లా వాసులను కరోనా వైరస్ బెంబేలెత్తించిన వేళ.. నగరంలో పరిస్థితులను మరింతగా కఠినతరం చేస్తున్నట్లుగా కలెక్టర్, సీపీ ప్రకటించారు. కరోనా వల్ల నెలకొన్న పరిస్థితులపై జిల్లా కలెక్టర్ కె.శశాంక, సీపీ కమలాసన్ రెడ్డి బుధవారం ఉదయం సమీక్షించారు. అనంతరం వారు మీడియా సమావేశం నిర్వహించారు. కరీంనగర్‌లో ప్రమాదకర జోన్ (రెడ్ జోన్)గా ప్రకటించిన ప్రాంతంలో అక్కడి ప్రజలకు కావాల్సిన అన్ని సౌకర్యాలను కల్పిస్తున్నట్టు కలెక్టర్ చెప్పారు. మంగళవారం ఒక్కరోజే స్థానికంగా ఉన్న 1,500 కుటుంబాలకు నిత్యావసర సరకులను పంపిణీ చేసినట్లుగా తెలిపారు. కరోనా అనుమానితులను 14 రోజుల పాటు క్వారంటైన్‌ తరలించి అక్కడే ఉంచుతున్నామని వివరించారు.

మరికొంత మందిని కరీంనగర్‌లో ఏర్పాటు చేసిన ఐసోలేషన్ వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నట్లు పేర్కొన్నారు. కరీంనగర్‌లో రెడ్ జోన్‌గా ప్రకటించిన ప్రాంతం నుంచి ఏ ఒక్కరూ బయటకు రావొద్దని తీవ్రమైన హెచ్చరిక చేశారు. లాక్ డౌన్ వల్ల నగరంలో తలెత్తిన చిన్న సమస్యలను వెంటనే పరిష్కరిస్తామని చెప్పారు. నిత్యావసర సరకులు అమ్మే కిరాణా దుకాణాలు, మార్కెట్‌ల వద్ద ప్రజలంతా విధిగా సామాజిక దూరం పాటించాలని సూచించారు. వ్యాపారులతోపాటు, కొనుగోలు దారులు కూడా సహకరించాలని కోరారు.

పోలీస్ కమిషనర్ కమలాసన్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆదేశానుసారం ప్రజలంతా రోడ్లపైకి రాకుండా పోలీసులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. కొద్దిరోజుల క్రితం వచ్చిన ఇండోనేసియన్లు తిరిగిన ప్రాంతాలను మొత్తం గుర్తించామని చెప్పారు. ఈ నేపథ్యంలో మిగతా జిల్లాల కంటే కరీంనగర్ మరింత జాగ్రత్తలు అవసరం ఉన్నందున నిబంధనలను, అత్యంత కఠినంగా ఇకపై అమలు చేయనున్నట్లుగా సీపీ తేల్చి చెప్పారు. నిబంధనలు అతిక్రమిస్తే ఎట్టి పరిస్థితుల్లో ఊరుకొనేది లేదని ఇప్పటికే ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారని గుర్తు చేశారు. ఆయన ఆదేశాలను పాటిస్తామని చెప్పారు.

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.