కేసీఆర్‌కు అమిత్ షా ఫోన్...దేశంలోనే అద్భుతంగా చేశారు


తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా అభినందనలు తెలిపారు. కరోనా మహమ్మారి కట్టడిలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు అందుకొని రాష్ట్రంలో ‘జనతా కర్ఫ్యూ’ను అద్భుతంగా నిర్వహించారని ఆయన కితాబిచ్చారు. జనతా కర్ఫ్యూను అద్భుతంగా నిర్వహించి, ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచారని అమిత్ షా పేర్కొన్నట్లు తెలుస్తోంది. ఆదివారం (మార్చి 22) ముఖ్యమంత్రి కేసీఆర్‌కు అమిత్ షా ఫోన్‌ చేసి మాట్లాడారు. జనతా కర్ఫ్యూ నిర్వహణలో తెలంగాణ ప్రజల స్ఫూర్తి, ప్రభుత్వ యంత్రాంగం చొరవ ప్రశంసించదగినదని ఈ సందర్భంగా కేసీఆర్‌తో అమిత్ షా అన్నట్లు తెలుస్తోంది. కరోనా నియంత్రణ కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై కూడా ఆయన హర్షం వ్యక్తం చేసినట్లు సమాచారం.

జనతా కర్ఫ్యూ విషయంలో తెలంగాణ ప్రజలు గొప్పగా స్పందించారని ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. తెలంగాణలో అద్భుతమైన దృశ్యం ఆవిష్కరించారని కొనియాడారు. రాష్ట్రంలోని ప్రజలందరూ ఇళ్లలోంచి బయటకి రాకుండా అద్భుత చొరవ ప్రదర్శించారని.. మానవాళి కోసం గొప్ప త్యాగం చేశారని పేర్కొన్నారు.

చప్పట్లు కొట్టడంలోనూ అదే తీరు కనబరచారని ముఖ్యమంత్రి కేసీఆర్ అభినందించారు. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కోగలమనే సందేశం ఇచ్చారని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున రాష్ట్రంలోని ప్రతి బిడ్డకు శిరస్సు వంచి ధన్యవాదాలు చెప్తున్నట్లు కేసీఆర్ పేర్కొన్నారు. కరోనా కట్టడి కోసం మార్చి 31 వరకు రాష్ట్రాన్ని లాక్ డౌన్ చేస్తున్నామని.. మరో వారం రోజులు ఇదే స్ఫూర్తి కొనసాగించాలని కేసీఆర్ పిలుపునిచ్చారు.

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.