కరోనా వైరస్.. తెలంగాణలో 3 లోకల్ కాంటాక్ట్ కేసులు.. 39కి పెరిగిన సంఖ్య

Image result for corona virus
కరోనా వైరస్‌ను రెండో దశలోనే కట్టడి చేసేందుకు కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు శాయాశక్తులా పనిచేస్తున్నాయి. ఆంక్షలను కఠినతరం చేయడంతో పాటు వైద్యపరంగా అవసరమైన అన్ని మార్గాలను అన్వేషిస్తున్నాయి. అయినప్పటికీ కొత్త కేసుల సంఖ్య పెరుగుతుండటం ఒకింత ఆందోళన కలిగించే అంశం. ముఖ్యంగా తెలంగాణలో ప్రతీరోజూ కొత్త కేసులు నమోదవుతూనే ఉన్నాయి. మంగళవారం(మార్చి 24) రాత్రి నాటికి మొత్తంగా మరో ఆరుగురికి కరోనా వైరస్ సోకినట్టు ఆరోగ్యశాఖ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 39కి చేరుకుంది.

లోకల్ కాంటాక్ట్ కేసులు.. 

మొత్తం ఐదు రెండో దశలో లోకల్ కాంటాక్ట్ ద్వారా మొదటిసారి హైదరాబాద్‌లోని కూకట్‌పల్లికి చెందిన ఓ మహిళకు వైరస్ సోకిన సంగతి తెలిసిందే. మంగళవారం కొత్తగూడెం డీఎస్పీ(57),ఆయన ఇంట్లో పనిచేసే వంట మనిషికి కరోనా పాజిటివ్‌గా తేలింది. విదేశాల నుంచి వచ్చిన కుమారుడిని నిబంధనలకు విరుద్దంగా ఇంటికి తీసుకెళ్లి పెట్టుకోవడం వల్లే ఈ రెండు కేసులు నమోదయ్యాయి. లోకల్ కాంటాక్ట్ ద్వారా ఇప్పటివరకు మొత్తం ఐదు కేసులు నమోదయ్యాయి.

వారంతా క్వారెంటైన్‌లో.. 

మొదటి లోకల్ పాజిటివ్ కేసుగా నమోదైన మహిళ.. ఎవరెవరిని కలిసింది.. ఎక్కడెక్కడ తిరిగిందనే సమాచారాన్ని ఆరోగ్య మంత్రిత్వ శాఖ టీమ్స్ సేకరిస్తున్నాయి. ఇక దుబాయ్ నుంచి వచ్చిన దంపతుల ద్వారా వారి కుమారుడికి కరోనా సోకింది. అలాగే ఇండోనేషియా నుంచి వచ్చిన బృందంతో కలిసి తిరిగిన కరీంనగర్ స్థానికుడికి కూడా కరోనా సోకిన సంగతి తెలిసిందే. ఇటీవల 600 మందితో కలిసి విదేశాల నుంచి వచ్చిన 15మందిని హోం క్వారెంటైన్ చేశారు.

మంగళవారం మూడు విదేశీ పాజిటివ్ కేసులు 

మంగళవారం నమోదైన విదేశీ పాజిటివ్ కేసుల్లో రంగారెడ్డి జిల్లా కోకాపేట్‌కు చెందిన 49 ఏళ్ల వ్యక్తి, రంగారెడ్డి జిల్లా చందానగర్‌కు చెందిన 39ఏళ్ల మహిళ,హైదరాబాద్‌లోని బేగంపేట్‌కు చెందిన 61 ఏళ్ల మహిళ ఉన్నారు. వీరితో పాటు మరో ముగ్గురు లోకల్ కాంటాక్ట్ ద్వారా మరో ముగ్గురికి వైరస్ సోకింది. వైరస్ సోకిన వ్యక్తులతో సన్నిహితంగా మెలిగినవారిని గాంధీ ఆసుపత్రిలో ఐసోలేషన్‌లో ఉంచారు. కొంతమందిని కరీంనగర్‌లోని చల్మెడ ఆనందరావు ఆసుపత్రిలో ఉంచారు. రాపిడ్ రెస్పాన్స్ టీమ్‌లో పనిచేస్తున్న ఓ వ్యక్తిలోనూ కరోనా అనుమానిత లక్షణాలు బయటపడటంతో అతన్ని కూడా ఐసోలేషన్‌కి తరలించినట్టు సమాచారం.

ఆంక్షలు కఠినతరం

 కరోనాపై రాష్ట్ర ప్రభుత్వం ఆంక్షలను మరింత కఠినతరం చేసిన సంగతి తెలిసిందే. రాత్రి 7గంటల నుంచి ఉదయం 6గంటల వరకు రాష్ట్రవ్యాప్తంగా కర్ఫ్యూ కొనసాగనుంది. నిత్యావసరాలు,కూరగాయలు కొనాలనుకునేవారు ఉదయం 6గం. తర్వాత తమ ఇంటికి 3కి.మీ దూరంలో ఉన్న ఏ కిరాణ షాపులోనైనా,ఏ కూరగాయల షాపులోనైనా వాటిని కొనుగోలు చేయవచ్చు. మంగళవారం(మార్చి 24) వరకు పోలీసులు సున్నితంగా మందలించి వదిలిపెట్టారని.. కానీ బుధవారం నుంచి ఎవరైనా రోడ్డు పైకి వస్తే కఠిన చర్యలు ఉంటాయని సీఎం హెచ్చరించారు. షూట్ ఎట్ సైట్ ఆర్డర్స్ దాకా తెచ్చుకోవద్దని హితవు పలికారు. జనాలు బుద్దిగా ఇళ్లల్లోనే ఉంటే అందరికీ మేలు అని చెప్పుకొచ్చారు.


No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.