కరోనా ఎఫెక్ట్: ఉద్యోగుల జీతాల్లో భారీ కోత.. కేసీఆర్ సర్కారు నిర్ణయం


కరోనా వైరస్ ప్రభావం, లాక్‌డౌన్ నేపథ్యంలో రాష్ట్ర ఆదాయం తగ్గడంతో తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఉద్యోగులు, ప్రజాప్రతినిధుల వేతనాల్లో కోత విధంచింది. సీఎం, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల వేతనాల్లో 75 శాతం కోత విధించిన టీఆర్ఎస్ సర్కారు.. మేయర్లు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల జీతాల్లోనూ ఈ మేరకు కోతపెట్టింది. ఆలిండియా సర్వీసులైన ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ ఉద్యోగాలు చేస్తున్న వారి జీతాల్లో 60 శాతం కోత విధించింది.

మిగతా ప్రభుత్వ ఉద్యోగుల జీతాల్లో 50 శాతం కోత పెట్టిన తెలంగాణ సర్కారు.. నాలుగో తరగతి ఉద్యోగులు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల జీతాల్లో 10 శాతం కోత విధించింది. మాజీ ఉద్యోగులకు ఇచ్చే పెన్షన్లలోనూ ప్రభుత్వం కోత పెట్టింది. రిటైర్డ్ ఉద్యోగులకు అందించే పెన్షన్లలో 50 శాతం కోత పెట్టిన సర్కారు.. నాలుగో తరగతి రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్లలో 10 శాతం కోత విధించింది.

ఉద్యోగులు, ప్రజాప్రతినిధుల వేతనాల్లో కోత విధించే అవకాశం ఉందని సీఎం కేసీఆర్ ఆదివారం నిర్వహించిన మీడియా సమావేశంలోనే సంకేతాలు ఇచ్చారు. సోమవారం సాయంత్రం తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై సమీక్షించిన సీఎం.. ఉద్యోగులు, ప్రజాప్రతినిధుల వేతనాల్లో కోత విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు.

కరోనా వైరస్‌పై పోరాటంలో తెలంగాణ ప్రభుత్వం అద్భుత పనితీరు కనబరుస్తోంది. ఎన్ని వేల కోట్లు ఖర్చయినా సరే.. కరోనాను కట్టడి చేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. లాక్‌డౌన్ వేళ రాష్ట్రంలో పండిన పంట మొత్తం కొనుగోలు చేస్తామని రైతులు ఇబ్బంది పడొద్దని కేసీఆర్ భరోసా ఇచ్చారు. కానీ లాక్‌డౌన్ కారణంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదని.. ఉద్యోగులకు జీతాలు ఇవ్వడానికే కష్టం అవుతోందన్నారు.

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.