లాక్‌‌డౌన్ వేళ.. ఏ సేవలు అందుబాటులో ఉంటాయి? మనం ఏం చేయొచ్చు?



లాక్‌డౌన్.. నిన్న మొన్నటి వరకూ మనకు అంతగా పరిచయం లేని పదం ఇది. చైనాలో వుహాన్ నగరాన్ని లాక్‌డౌన్ చేశారు. ఇటలీ మొత్తాన్ని లాక్ డౌన్ చేశారనే వార్తలను చదువుకున్నాం. కానీ కరోనా రక్కసి కోరలు చాచి.. మరణమృందంగం మోగించాలని చూస్తున్న వేళ... లాక్‌డౌన్ ప్రభావం మెల్లగా మనకు అనుభవంలోకి వస్తోంది. కరోనా వైరస్ కేసులు నమోదైన 75 జిల్లాలను లాక్‌డౌన్ చేస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. ఇందులో ఏపీలో ప్రకాశం, కృష్ణా, విశాఖపట్నం జిల్లాలున్నాయి. తెలంగాణ ప్రభుత్వం మార్చి 31 వరకు లాక్‌డౌన్ ప్రకటించింది. ఎమర్జెన్సీ మెడికల్ సర్వీసులు మాత్రమే అందుబాటులో ఉంటాయి. లాక్‌డౌన్ అంటే మనమంతా ఇంటికి పరిమితం కావడమే. ఎవరూ ఇళ్ల నుంచి బయటకు రావద్దు. అత్యవసరంగా మాత్రమే వైద్యసేవలు అందిస్తారు. అత్యవసరం కాని వైద్యసేవలను వాయిదా వేసుకోవడం ఉత్తమం. ఆర్టీసీ బస్సులు, ప్రయివేట్ బస్సులు ఆటోలు, ట్యాక్సీలు రోడ్డు ఎక్కవు. రాష్ట్ర సరిహద్దులు మూసివేస్తారు. అత్యవసరాలను తీసుకొచ్చే వాహనాలను మాత్రమే రాష్ట్రం లోపలికి అనుమతిస్తారు.

అత్యవసర సేవలకే పరిమితం

లాక్‌డౌన్ ప్రకటిస్తే.. అత్యవసర విభాగాలకు సంబంధించిన సేవలు మినహా మిగతా సేవలన్నీ రద్దవుతాయి. ప్రజలెవరూ ఇళ్ల నుంచి బయటకు రావొద్దు. హాస్పిటళ్లు, మెడికల్ షాపులు, సూపర్ మార్కెట్లు, పాలు, కూరగాయల షాపుల్లాంటివి మాత్రమే తెరిచి ఉంటాయి. మిగతా షాపులు, ఆఫీసులన్నీ మూసివేస్తారు. ప్రభుత్వ ఉద్యోగులు కూడా అత్యవసర విభాగాలకు చెందిన వారు మాత్రమే విధులకు హాజరు కావాల్సి ఉంటుంది. ప్రయివేట్ ఉద్యోగులు ఇంట్లో నుంచి పని చేసుకోవాల్సి ఉంటుంది. ప్రజలు గుంపులు గుంపులుగా చేరడం నిషేధం. ఐదుగురి కంటే ఎక్కువ గుమికూడొద్దు. ఈ నిబంధనను అతిక్రమిస్తే... అరెస్ట్ చేసే హక్కు పోలీసులకు ఉంటుంది. అంటే ఫంక్షన్లు, పెళ్లిళ్ల లాంటి వేడుకలకు భారీ సంఖ్యలో జనం హాజరు కావడం కుదరదు. లాక్‌డౌన్ ప్రకటన కంటే ముందే తెలుగు రాష్ట్రాల్లో స్కూళ్లు, సినిమా హాళ్లు, షాపింగ్ మాల్స్‌ను మూసేసిన సంగతి తెలిసిందే. పరీక్షలు కూడా రద్దయ్యాయి.

రోడ్డెక్కడం కుదరదు

ఇంట్లో పిల్లలను తీసుకొని సరదాగా బయటకెళ్దాం అంటే కుదరదు. బయట ఫుడ్ కూడా దాదాపుగా దొరకదు. ఇంట్లో మనకు మనంగా స్వీయ నిర్బంధం విధించుకోవడమే లాక్‌డౌన్. ఏదో అత్యవసరమైన పని ఉంటే తప్పితే ఇంట్లో నుంచి కదలొద్దు. బయటకు వెళ్లినా ఇంటికి ఒక్కరు మాత్రమే వెళ్లాల్సి ఉంటుంది. మిత్రులను ఇంటికి పిలిపించుకొని సరదాగా కబుర్లు చెప్పుకోవడం లాంటి పనులు కూడా చేయొద్దు. మీ కుటుంబ సభ్యులతో మాత్రమే గడపాల్సి ఉంటుంది. విసుగు అనిపించినా.. ఇబ్బందిగా అనిపించినా.. మనల్ని మనం కాపాడుకోవడం కోసం ఇది తప్పదు. కొద్ది రోజులు ఇంట్లోకి సరిపడా సరుకులు, అత్యవసరమైన మందులు, కొవ్వొత్తులు లాంటివి సమకూర్చుకోవాలి. నిర్ణీత సమయంలోనే బయటకు వెళ్లాల్సి ఉంటుంది. పొద్దస్తమానం ఇంట్లో ఉంటే బోర్ కొడుతుంది కాబట్టి.. చిన్న చిన్న ఎక్సర్‌సైజ్‌లు, యోగా లాంటివి చేస్తే కాస్త రిలీఫ్‌గా ఉంటుంది.

బ్యాంకులు, బంకులు తెరిచే ఉంటాయ్..

లాక్‌డౌన్ వేళ ఏ సేవలు అందుబాటులో ఉంటాయి, ఏవి ఉండవనేది చాలా మందికొచ్చే అనుమానం. బ్యాంకులు, ఏటీఎంలు తెరిచే ఉంటాయి. ఇన్సూరెన్స్ సంస్థలు, పోస్టు ఆఫీసులు, టెలీకాం సేవలు అందించే సంస్థలతోపాటు పెట్రోల్ బంకులు, సీఎన్‌జీ బంకులు కూడా తెరిచి ఉంటాయి. ఎల్పీజీ గ్యాస్ సేవలు, మెడికల్ షాపులు, హాస్పిటళ్లు, నిత్యవసరాలు విక్రయించే షాపులు, పండ్లు, కూరగాయల షాపులు, పాలు విక్రయించే దుకాణాలు తెరిచి ఉంటాయి. కానీ సాధారణ పరిస్థితుల్లో ఉన్నట్టుగా సేవలు పొందలేకపోవచ్చు

రేషన్ ఫ్రీ.. వైన్లు బంద్

అంగన్‌వాడీ కేంద్రాలు మూసివేస్తారు. కానీ తెలంగాణలో పిల్లలకు పోషకాహారం అందించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. వైన్ షాపులు మూసివేస్తారు. రేషన్ కార్డు ఉన్న కుటుంబాలన్నింటికీ నెలకు రూ.1500 అందిస్తామని తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రకటించారు. తెల్ల రేషన్ కార్డు ఉన్న కుటుంబంలో ఒక్కొక్కరికి 12 కిలోల చొప్పున బియ్యం ఇస్తామని ప్రకటించారు. లాక్‌డౌన్ కాలంలో ప్రయివేట్ ఉద్యోగులకు కూడా పూర్తి స్థాయిలో వేతనాలు చెల్లించాల్సి ఉంటుంది. కాస్త ఇబ్బంది అయినప్పటికీ.. కొద్ది రోజులపాటు మనం ఇంట్లో నుంచి కదలకపోవడం వల్ల మనల్ని మనం కాపాడుకోవడంతోపాటు ప్రజలందరి ప్రాణాలను కాపాడగలం.

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.