పెరుగుతున్న కరోనా కేసులు.. కేసీఆర్ మరో కఠిన నిర్ణయం?

తెలంగాణలో కరోనా కేసులు రోజూ కొత్తవి నమోదు అవుతూనే ఉన్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో వైరస్ వ్యాప్తి రెండో దశలో ఉన్న నేపథ్యంలో మొత్తం కొవిడ్ కేసుల సంఖ్య 45కు చేరింది. అయితే, కేంద్ర ప్రభుత్వం విధించిన లాక్ డౌన్, రాష్ట్ర ప్రభుత్వం రాత్రి సమయంలో విధించిన కర్ఫ్యూలను కొన్ని చోట్ల ప్రజలు పట్టించుకోవడం లేదు. ఇలాగైన చేస్తున్న ప్రయత్నాలు బూడిదలో పన్నీరయ్యే అవకాశం ఉంది. ఈ ధోరణిపై ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా కాస్త అసహనంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. చివరిసారి నిర్వహించిన మీడియా సమావేశంలోనూ ప్రజలు బాధ్యతగా ఉండాలని, కనిపిస్తే కాల్చి పారేసే వరకూ తెచ్చుకోవద్దని తీవ్రంగా హెచ్చరించిన సంగతి తెలిసిందే.

అయితే, గురువారం సీఎం అధ్యక్షతన ఉన్నతాధికారులతో మరోసారి సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో కరోనా కట్టడి, లాక్ డౌన్, కర్ఫ్యూ అమలు విషయాలపై వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్, సీఎస్ సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఇందులో పలు కీలక అంశాల గురించి చర్చించినట్లు తెలుస్తోంది. ప్రజలు ఎక్కువగా బయట తిరితే కరోనాను కట్టడి చేయడం అసాధ్యమని భావించి, ప్రస్తుతం రాత్రి సమయంలో సాగుతున్న కర్ఫ్యూ, లాక్ డౌన్‌ను మరింత పకడ్బందీగా అమలు చేయాలని సీఎం అభిప్రాయపడ్డారని విశ్వసనీయ వర్గాల సమాచారం.

ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం సాయంత్రం 7 నుంచి ఉదయం 6 గంటల వరకు పటిష్ఠమైన కర్ఫ్యూ అమలు చేస్తోంది. మార్చి 31 వరకే కర్ఫ్యూను అమలు చేస్తామని తొలుత ప్రకటించారు. ఇప్పుడు కరోనా కేసులు మరిన్ని పెరుగుతున్నందున పటిష్ఠ చర్యల్లో భాగంగా రాత్రి పూట కర్ఫ్యూను 21 రోజులకు అంటే ఏప్రిల్ 14 వరకు పెంచాలని సీఎం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. దీనిని త్వరలోనే అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని అధికార వర్గాలు వెల్లడించాయి.

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.