కొత్తగూడెం డీఎస్పీ కుమారుడికి పాజిటివ్

హైదరాబాద్: తెలంగాణలో మరో కరోనా వైరస్ పాజిటివ్ కేసు నమోదైంది. భద్రాద్రి కొత్తగూడెం డీఎస్పీ కుమారుడికి కరోనా పాజిటివ్‌గా తేలింది. అతణ్ని సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన ఐసొలేషన్ వార్డుకు తరలించారు. డీఎస్పీ కుటుంబ సభ్యులందరికీ పరీక్షలను నిర్వహిస్తున్నారు. వారందర్నీ క్వారంటైన్‌కు తరలించారు. డీఎస్పీ కుటుంబ సభ్యులకు ఈ ప్రాణాంతక వైరస్ సోకిందా? లేదా? అనేది ఇంకా తేలాల్సి ఉంది.


లండన్‌లో ఎంఎస్ చేస్తూ..

కరోనా వైరస్ బారిన పడిన డీఎస్పీ కుమారుడు.. లండన్‌లో ఎంఎస్ చదువుతున్నాడు. ఈ నెల 18వ తేదీన స్వస్థలానికి చేరుకున్నాడు. రెండురోజుల కిందట దగ్గు, జ్వరంతో బాధపడ్డాడు. దీనితో అతణ్ని కొత్తగూడెం ఏరియా ఆసుపత్రిలో వైద్య పరీక్షలను నిర్వహించారు. అతనికి కరోనా వైరస్ సోకినట్టు ఏరియా ఆసుపత్రి డాక్టర్లు నిర్ధారించారు. వెంటనే అతణ్ని ప్రత్యేక అంబులెన్స్ ద్వారా సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రికి తరలించారు.

ఎవరెవర్ని కలిశాడనే విషయంపై ఆరా..

ఈ నెల 18వ తేదీన లండన్ నుంచి కొత్తగూడేనికి చేరుకున్న అతను దగ్గు, జ్వరం బారిన పడేంత వరకూ ఎవరెవరిని కలిశాడనే విషయం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధికార యంత్రాంగం ఆరా తీస్తోంది. రెండు రోజుల పాటు అతను కొత్తగూడెంలోనే తన స్నేహితులు, బంధుమిత్రులను కలుసుకున్నట్లు తేలింది. వారెవరనే విషయాన్ని డీఎస్పీని అడిగి తెలుసుకుంటున్నారు. ఆ విద్యార్థి కలిసిన వారిని కూడా కరోనా వైరస్ పరీక్షలను నిర్వహించాల్సి ఉంటుందని అధికారులు స్పష్టం చేస్తున్నారు.

గన్‌మెన్‌తో సేవలు చేయించినట్లు ఆరోపణలు..

కాగా- కరోనా వైరస్ సోకిన తన కుమారుడికి డీఎస్పీ తన గన్‌మెన్లతో సేవలను చేయించాడనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అంబులెన్స్‌లో తరలించే సమయంలో డీఎస్పీ గన్‌మెన్లు.. ఆ యువకుడికి సంబంధించిన కొన్ని వస్తువులను తీసుకుని వచ్చారని, ఆ సమయంలో వారు ముఖానికి మాస్క్ మాత్రమే తగిలించుకున్నారని, అతని వస్తువులను తీసుకొచ్చే సమయంలో గ్లోవ్స్ ధరించలేదని అంటున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో డీఎస్పీ చర్య పట్ల విమర్శలు వ్యక్తమౌతున్నాయి.

భద్రాద్రి జిల్లాలో రెండో పాజిటివ్

గన్‌మెన్ సహా డీఎస్పీ కుటుంబ సభ్యులందరినీ వరంగల్‌లో ఏర్పాటు చేసిన క్వారంటైన్‌లో పరీక్షలను నిర్వహించారు. ప్రస్తుతం వారు క్వారంటైన్‌లోనే ఉన్నట్లు తెలుస్తోంది. డీఎస్పీ కుటుంబ సభ్యులకు కూడా పాజిటివ్‌గా తేలితే పరిస్థితి ఏమిటనే ప్రశ్న తలెత్తుతోంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నమోదైన రెండో కరోనా వైరస్ పాజిటివ్ కేసు ఇది. ఇంతకుముందు అశ్వాపురానికి చెందిన రాయల స్నేహ ఈ వైరస్ బారిన పడిన విషయం తెలిసిందే. ఇటలీ నుంచి వచ్చిన ఆమెకు కరోనా సోకినట్లు నిర్ధారించారు.

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.