దేశ ప్రధాని పైనే సెటైర్లా.. వెంటనే అరెస్టు చేయండి: కేసీఆర్



ప్రధాని నరేంద్ర మోదీపై కొంత మంది సోషల్ మీడియాలో చేస్తున్న ట్రోలింగ్స్‌పై ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్రంగా స్పందించారు. ‘ఐక్యత చాటుతూ.. చప్పట్లు కొట్టాలని ప్రధాని పిలుపునిస్తే, కొంత మంది వెదవలు మోదీని అవహేళన చేస్తూ పోస్టులు పెడుతున్నారని ఆయన మండిపడ్డారు. సంఘీభావం తెలిపే పని చేయాలని ఆయన కోరితే ఇలాగే చేస్తారా? మన ప్రధానికి మనమే కించపరచుకుంటామా? అని కేసీఆర్ అన్నారు. దేనికైనా ఓ లిమిట్ ఉంటుందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో అలాంటి పోస్టులు చేస్తున్న వారిని వెంటనే అరెస్టు చేసి చర్యలు తీసుకోవాలని డీజీపీ మహేందర్ రెడ్డిని ఆదేశించారు.

నేను కూడా చప్పట్లు కొడతా: కేసీఆర్

కరోనా వైరస్ నియంత్రణ చర్యలపై సీఎం కేసీఆర్ శనివారం (మార్చి 21) మధ్యాహ్నం ప్రగతి భవన్‌లో మీడియాతో మాట్లాడారు. ప్రధాని మోదీ సూచన మేరకు రాష్ట్రంలో ఆదివారం జనతా కర్ఫ్యూను విజయవంతం చేయాలని తెలంగాణా సమాజానికి పిలుపునిచ్చారు. ఆదివారం సాయంత్రం 5 గంటలకు దేశ ప్రజలందరూ ఆరుబయటకు వచ్చి చప్పట్లు కొట్టాలంటూ ప్రధాని ఇచ్చిన పిలుపు గురించి ప్రస్తావించారు. ప్రధాని ఇచ్చిన పిలుపులో ఎలాంటి దురుద్దేశం లేదని కేసీఆర్ స్పష్టం చేశారు. ఐక్యతను చాటడం కోసం అన్ని దేశాలు ఇలాగే చేస్తాయని.. కరోనా విషయంలో ఇటలీ తదితర దేశాలు కూడా ఇలాంటివి చేశాయని చెప్పారు. తెలంగాణ ప్రత్యేక ఉద్యమ సమయంలో ఇలాంటివి చేసినట్లు కేసీఆర్ గుర్తు చేశారు. నాడు గంట మోగించాలని పిలుపునిస్తూ.. ప్రజలు ప్లేట్లు, గిన్నెలు, గ్లాసులు లాంటివి ఏవి అందుబాటులో ఉంటే, అవి తీసుకొచ్చి మోగించారని చెప్పారు. అది ఐక్యతకు సంకేతం అన్నారు. ఆదివారం 5 గంటలకు తాను కూడా చప్పట్లు కొడతానని చెప్పారు.

5 గంటలకు రాష్ట్రవ్యాప్తంగా సైరన్లు మోగుతాయ్..

ప్రధాని మోదీ పిలుపు మేరకు ఆదివారం సాయంత్రం 5 గంటలకు అందరూ బయటకొచ్చి చప్పట్లు కొట్టాలని కేసీఆర్ సూచించారు. సరిగ్గా 5 గంటలకు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో సైరన్ మోగుతుందని.. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు చేశామని వివరించారు. గుమ్మం దగ్గరికి వచ్చి నిల్చొని 4 నిమిషాలు చప్పట్లు కొట్టాలని సూచించారు. సరిగ్గా 5 గంటలకు తనతో పాటు కుటుంబ సభ్యులు కూడా ఆరుబయటకి వచ్చి చప్పట్లు కొడతామని చెప్పారు. మంత్రులందరూ చప్పట్లు కొడతారని చెప్పారు. సంక్లిష్ట సమయంలో దేశం కోసం అందరం కలిసి పనిచేయాలని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. ప్రస్తుతం కరోనా నియంత్రణ విషయంలోనూ ప్రధాని సహా ముఖ్యంత్రులందరూ కలిసి పనిచేస్తున్నారని చెప్పారు.

24 గంటల కర్ఫ్యూ.. దేశానికే ఆదర్శంగా నిలుద్దాం

తెలంగాణలో 24 గంటల పాటు జనతా కర్ఫ్యూ పాటిద్దామని కేసీఆర్ పిలుపినిచ్చారు. ఆదివారం ఉదయం 6 గంటల నుంచి సోమవారం ఉదయం 6 గంటల వరకు జనతా కర్ఫ్యూలో పాల్గొనాలని ప్రజలకు సూచించారు. ఆదివారం తెలంగాణలో ఎమర్జెన్సీ సేవలు మినహా అన్ని సేవలు బంద్ చేస్తున్నట్లు చెప్పారు. ఆర్టీసీ, మెట్రో సేవలను నిలిపివేస్తున్నట్లు చెప్పారు. అత్యవసర అవసరాల కోసం డిపోకు ఐదు ఆర్టీసీ బస్సులు, ఐదు మెట్రో రైలు సిద్ధంగా ఉంటాయని తెలిపారు. దుకాణాలు, వైన్స్, ఇతర షాపులు, మాంసం దుకాణాలు ఒక్క రోజు కోసం బంద్ చేయాలని ఆదేశించారు. కూలీలు, కార్మికులు కూడా ఒక్క రోజు బంద్ పాటించాలని పిలుపునిచ్చారు. కరోనాపై పరిస్థితి తీవ్రత దృష్ట్యా మహారాష్ట్ర సరిహద్దును మూసివేసే ఆలోచన చేస్తామన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి ఆర్టీసీ బస్సులు వస్తే రేపు నిలిపేస్తామన్నారు. 24 గంటలు కర్ఫ్యూ పాటించి దేశానికి ఆదర్శంగా నిలుద్దామని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు.

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.